యూ ట్యూబ్ నుండి వీడియోలు ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి ?

నేటి తరం ఉపాధ్యాయులు మారుతూ ఉన్నారు. కొత్త విషయాలు, టెక్నాలజీ నేర్చుకుంటున్నారు. చాలా పాఠశాలలో TV లు కనబడుతున్నాయి. ఉన్నత పాఠశాలలో K-YAN లు ఉన్నాయి. చాలా మంది ఉపాధ్యాయులు వాటిని చక్కగా వాడుకుంటున్నారు. కొంత మంది ఉపాధ్యాయులు సొంతంగా రికార్డు చేసి వీడియోలు కూడా తయారు చేసుకుంటున్నారు. వాటిని యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. వాటిని మనం డౌన్ లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.

ఈ వీడియోలు మన బోధనఅభ్యసన ప్రక్రియను ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా చేస్తాయి అనడం లో ఎటువంటి సందేహం లేదు.అయితే ముందు మీరు వాటిని పూర్తిగా చూసి మాత్రమే ఉపయోగకరం అనుకుంటేనే డౌన్ లోడ్ చేసుకోండి. వాటిని తరగతి గది లో ప్లే చేసేటపుడు మీరు రిమోట్ దగ్గర పెట్టుకుని మధ్య మధ్య లో పాజ్ చేస్తూ అవసరం అయిన చోట అదనపు సమాచారం అందిస్తూ, వివరిస్తూ చూపించాలి.

అంతే గానీ ఈ పాఠం వీడియో ఇక్కడ పెట్టి ఇంకో తరగతి కి నేను వెళ్తాను మళ్ళీ వచ్చి ఇంకో వీడియో పెడతాను అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. విద్యార్థి స్వతహాగా వీడియో మొత్తం చూడడానికి అది బాహూబలి నో , RRR, లేక పుష్ప సినిమా కాదు. పిల్లల ఆసక్తి చాలా తక్కువ సమయం ఉంటుంది ఆ విషయం మీకు కూడా తెలుసు. టెక్నాలజీ ఉపాధ్యాయునికి Alternate కాదు support మాత్రమే . కాబట్టి వీటిని మీరు సరైన విధంగా ఉపయోగించుకోండి.

ఇక అసలు విషయానికి వద్దాము. యూ ట్యూబ్ నుండి వీడియోలు ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి ? ఏదైనా మీకు నచ్చిన యూ ట్యూబ్ చానెల్ లో కావలసిన వీడియో సెలెక్ట్ చేసుకోండి. అది ప్లే అవుతున్నప్పుడు కింది విధంగా కనబడుతుంది.ఉదాహరణకి నేను మన “easy teach with praveen” యూ ట్యూబ్ చానెల్ లో ఒకటవ తరగతి వీడియో సెలెక్ట్ చేశాను.

పైన అడ్రస్ బార్ లో కనబడుతున్న దానిని లింక్ లేదా url అని అంటాము. అది ఈ విధంగా ఉంటుంది. https://youtu.be/CU7UyVMDWT8 ఇది లింక్ .

మనం పైన ఉన్న అడ్రస్ బార్ లోకి వెళ్ళి ఇలా కనిపిస్తున్న లింక్ లో y కన్నా ముందు ss అని టైప్ చేయాలి .

ఇలా www. తర్వాత y కన్నా ముందు ss అని టైప్ చేసి కీ బోర్డ్ లో enter ప్రెస్ చేసిన తర్వాత ఇలా మరొక పేజీ ఓపెన్ అవుతుంది.

ఇలా మనకు కావలసిన వీడియో పక్కన డౌన్ లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది.

ఆ డౌన్ లోడ్ బటన్ పై క్లిక్ చేయండి. కింద చూపిన విధంగా మరొక విండో ఓపెన్ అవుతుంది. మీ కంప్యూటర్ లో ఎక్కడ save అవుతుంది?, ఏ పేరు తో save అవుతుంది ? ఏ ఫార్మాట్ లో save అవుతుంది అనే విషయాలు పరిశీలించుకుని save చేసుకోండి.

ఉదాహరణ కు నా కంప్యూటర్ లో desktop పై save అవుతుంది.

ఇలా డౌన్ లోడ్ చేసుకున్న వీడియో లను మీ pen drive లోకి copy చేసుకుని

మీ పాఠశాల కి తీసుకెళ్ళి అక్కడ ఉన్న కంప్యూటర్, TV, KYAN, వంటి వాటిల్లో వేసి చక్కగా ప్లే చేసి మీ పిల్లలకు వినియోగించండి..

ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టండి. మీ మీ అనుభవాలు ఫోటోలు మాకు పంపించండి. మన వెబ్ సైట్ లో ప్రచురిద్దాం.

ఈ ఆర్టికిల్ పై మీ అభిప్రాయం కామెంట్ ల రూపం లో తెలుపండి.

ఇట్లు

మీ

పోతురాజు

చేతి నిండా చాక్ పీస్ పొడి పూసుకుంటున్నారా?

టీచర్ గా పని చేస్తుంటే చాక్ పీస్ పొడి అంటడం సహజం. దానికి మళ్ళీ పూసుకుంటున్నారా ? అని అడగడం దేనికి ? అని చాలా మందికి అనిపించి ఉండవచ్చు.

కానీ చాలా మంది టీచర్లు ఈ చాక్ పీస్ పొడి వల్ల చాలా రకాలు గా ఇబ్బంది పడిన వాళ్ళను చూశాను. చేతికి చాక్ పీస్ పొడి అంటుకోవడం , మధ్యలో చెమట తుడుచుకోవడం కోసం కర్చీఫ్ తీసినపుడు దుస్తులకు అంటుకుంటుంది.

ఇంకా మనకు తెలియకుండానే చాలా చాక్ పీస్ పొడి మన ఊపిరి తిత్తుల లోకి వెళ్ళడం, దాని వల్ల ఆరోగ్యం పాడవడం చాలా మంది ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగడం మీకు తెలిసే ఉంటుంది. ఇక లెక్కల టీచర్ల బాధ చెప్పనలవి కాదు. వాళ్ళు రాసుడు , తుడుచుడు గిదే పని.

మరి దీనికి పరిష్కారం ఏమిటి అని చాలా మందికి సందేహం వచ్చి ఉంటుంది. డస్ట్ లెస్ చాక్ పీస్ లు ఉన్నాయి కదా అని చాలా మంది సమాధానం కూడా చెప్పి ఉంటారు. కానీ దాని కన్నా ఇంకా చాలా చక్కగా మరిన్ని ప్రయోజనాలు ఉన్న పరిష్కారం ఇక్కడ మీకు చెప్పబోతున్నాము. నిజంగా ఇది చాలా అద్భుతమైన విషయం అని నాకు అనిపించింది. అందుకే మీకు అందరికీ ఈ విషయం తెలియజేయాలని ఈ ఆర్టికిల్ రాయడం జరిగినది.

ఆ పరిష్కారం పేరే ” chalk holder”

ఇది చాలా చక్కగా అర చేతిలో ఇమిడి పోయి చాక్ పీస్ ను తనలోపాల దాచుకుని చాక్ పీస్ పొడి మనకు అంటకుంట కాపాడుతుంది. చిన్న చిన్న ముక్కలతో కూడా సులభంగా రాయవచ్చు కాబట్టి చాక్ పీస్ లు ఎక్కువ కాలం రాయవచ్చు. వృథా తగ్గుతుంది.

మాకెప్పుడో తెలుసు అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ నాకు మాత్రం దీని గురించి ఈ రోజే తెలిసింది. దీనిని కొనే బుక్ స్టాల్ అతన్ని అడిగాను ఈ product వచ్చి ఎన్ని రోజులు అయింది ? అని ఒక 2-3 సంవత్సరాలు అయి ఉండవచ్చు అన్నాడు.

అవునా నాకు ఇంత చిన్న విషయం తెలియదా ?. నేను పెద్ద డిజిటల్ టీచర్, up to date ఉంటాను అని గర్వంగా ఫీల్ అయ్యేవాడిని కానీ నా గర్వము సర్వము ఖర్వము చేసినది ఇది. ఇలా నాలాంటి చాలామంది ఉంటారు అని వారికి దీని గురించి చెప్పాలనే ఆలోచనతో ఈ ఆర్టికిల్ రాస్తున్నాను.

ఇంకా ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

చూశారు కదండీ మన టీచర్లకు ఎంతో మేలు చేసే ఈ product తయారు చేసిన కంపెనీకి , ఐడియా ఇచ్చిన వారికి టీచర్ల అందరి తరపున శతకోటి వందనాలు.

ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకటి కొనేసి వాడేయండి.

మీ

పోతురాజు.

గేయం చార్టు లు ఎలా తయారు చేసుకోవాలి ?

భాషా బోధన లో బోధనభ్యసన సామాగ్రి కి ఉన్న ప్రాముఖ్యత గురించి మనం ఇదివరకే తెలుసుకున్నాము. ఈ రోజు మనం గేయం చార్టు ఎలా తయారు చేసుకోవాలి?

వాటిని ఎలా ఉపయోగించాలి అనీ అంశం చూద్దాం.

గేయం చార్టు ఎందుకు తయారు చేసుకోవాలి ? పాఠ్య పుస్తకం లో ఉన్న గేయం చిత్రం చిన్నదిగా ఉంటుంది కదా. విద్యార్థులందరికీ కనబడేలా మనం ఒక డ్రాయింగ్ షీట్ తీసుకుని దానిపై పెద్ద అక్షరాలతో చార్టు రాస్తాము. అలా రాయడం వల్ల పిల్లలదరికీ అక్షరాలు బొమ్మ లు కనబడతాయి. మనం వాళ్ళ కోసం ఏదో తయారు చేసారు అనే భావన ఆసక్తి తో గమనిస్తూ ఉంటారు.

ఈ చార్టు తయారు చేసేటపుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు.

పాఠ్య పుస్తకం లో ఉన్నట్టు గానే వాక్యాలు రాయాలి. అనగా ఏ లైన్ లో ఏ పదం ఉన్నదో ఉన్నది ఉన్నట్టు గా చార్టు మీద కూడా అదే విధంగా రాయాలి. స్థలం సరిపోక ఒక లైన్ ను రెండు లైన్ లు గా విభజించడం, లేదా స్థలం మిగిలింది కదా అని రెండు లైన్ లు ఒకే లైన్ గా కలిపి రాయడం చేయకూడదు.

పుస్తకం లో ఉన్న చిత్రాలు మీరు గీయగలిగితే మరీ మంచిది. వాటిని వాక్యాల పైకి రాకుండా పక్కలకు వేసుకోండి. గేయం లోని వాక్యాలను మరొక చార్టు లో రాసి పెట్టుకుని వాటిని లైన్ వారీగా కత్తిరించి పెట్టుకోవాలి. వీటిని పిల్లలకు చూపించి గేయం లో ఉన్న లైన్ కి వీటిని జతపరచమనాలి. అలా వారు గ్రాఫిక్ రీడింగ్ లో వాక్యాలను గుర్తించగలుగుతారు. వీటి వెనకాల మనం ఆ పాఠం లో పరిచయం చేసిన పదాలు రాసుకోవచ్చు.

ఇలా తయారు చేసుకున్న చార్టులకు పాలిథీన్ షీట్ దొరుకుతుంది. అది డబల్ ఉంటుంది. కొద్దిగా కష్టపడితే దానిని విడదీసి అందులో మన రాసిన చార్టు ఉంచి దానిని వైట్ ప్లాస్టర్ తో సీల్ చేస్తే ఒక రెండు సంవత్సరాల వరకు ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. ఇవి నేను కరోనా కు ముందు తయారు చేసినవి.

ఇలా తయారు చేసుకున్న సామాగ్రి ని ఉపయోగించి బోధన చేసినపుడు పిల్లల స్పందన ఎలా ఉందో ఈ వీడియోలలో మీరే చూడండి.

చూశారు కదండీ.. ఒక్క సారి కష్టపడి మనం తయారు చేసి పెట్టుకుంటే తర్వాతి సంవత్సరం కూడా ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి, పట్టుదల ఉన్న వారు మొదలు పెట్టండి. మీరు తయారు చేసి ఉపయోగించి, పిల్లల స్పందనలను రికార్డు చేసి పంపండి. మన “easy teach with praveen “యూ ట్యూబ్ చానెల్ లో ప్రసారం చేస్తాము.

ఇట్లు

మీ

పోతరాజు.

ఆలెక్సా రెండు నెయ్యి దోశలు ప్రింట్ చేయి

మీరు చదివింది కరెక్టే . దోశల ప్రింటర్ వచ్చేసింది. చపాతీలు తయారు చేసే యంత్రం ఎక్కువ వంటగదులలోకి దూరక ముందే మరో విచిత్ర యంత్రం తయారు అయింది.

ఉరుకుల పరుగుల జీవితం లో చపాతీలు దోశలు తయారు చేయాలంటే ఎంత సమయం, ఎంత ఓపిక ఉండాలో చేసే వారికే తెలుస్తుంది.అలాంటి వారి సమయాన్ని శ్రమ ను ఆదా చేసేందుకు వచ్చేసింది. దోశ లు ప్రింట్ చేసే యంత్రం..

Evo chef వారు తయారు చేసిన ఈ యంత్రం స్మార్ట్ గా పనిచేస్తుందట. రోస్ట్ గా కావాలన్నా లేదా మెత్తగా ఉండాలన్నా, నెయ్యి దోశలైనా, లేక వెన్న దోశలైనా ఇంకా రాగి దోశ లాంటివి కూడా తయారు చేస్తుందట.. పిండిని ప్రింటర్ లో ఇంకు పోసినట్టు పొయ్యడమే అఆ తర్వాత స్విచ్ ఆన్ చేసి ఎంత రోస్ట్ కావాలి ఎన్ని కాపీలు , కాదు కాదు ఎన్ని దోశలు కావాలంటే అన్ని ప్రింట్ చేసి పెడుతుంది. మీరు పెనం ముందు గంటలు గంటలు నిలుచోవల్సిన పని అసలు లేదు.

నువ్వే కావాలి సినిమా లో కోవై సరళ

“చిన్ని చిన్ని ఆశ కాలుతోంది దోశ

చిన్ని చిన్ని ఆశ కాలుతోంది దోశ

పిండి నే తీసి , పెనముపై పోసి ,

అట్లకాడ తోసి తిరగేసి తీసి ..”

అని పాడుకుంటూ దోశలు వేసేది.. ఇక ఆ పాట “పిండినే తీసి ,, మిషన్ లో పోసీ అని పాడుకోవాలి కాబోలు..

నమ్మబుద్ది కావట్లేదు కదూ.. నాకూ అలానే అనిపించింది.. ఇటీవల వీళ్ళు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో చూసే వరకూ నాకూ నమ్మ బుద్ది కాలేదు.. చూశాక నిజమే సుమీ అనిపిస్తుంది. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి..

https://bit.ly/3ALTIgc

అతివల కష్టాన్ని, సమయాన్ని కాస్త ఆదా చేసేందుకు మనిషి సృష్టించిన మరో అద్భుత యంత్రం ఇది. అన్నట్టు దీని ధర మాత్రం ఇంకా చెప్పలేదండీ.. నంబర్ ఇచ్చినట్లు ఉన్నారు.. కనుక్కోండి.. ఓటి తెచ్చేసుకోండి అలా పడి ఉంటది..

ఆహా ఏమి రుచి అనరా మైమరచి.. యంత్రపు దోశలలో రుచిఎలాగుండునో ..

ఎవరైనా తెప్పించుకుంటే నాకూ ఓ రెండు దోశలెయ్యండి వచ్చేస్తా తినడానికి..

ఇట్లు..

మీ

పోతురాజు..

తెలుగు ఫ్లాష్ కార్డ్స్ తయారీ

ఫ్లాష్ కార్డ్స్ : ఇవి భాషా బోధన లో చాలా చక్కగా పనిచేస్తాయి. పాఠ్య పుస్తకం, నల్ల బల్ల కాకుండా వేరే ఏ వస్తువు ఇచ్చినా పిల్లవాడు ఆసక్తి తో చూస్తూ ఉంటాడు. అది బోధనఅభ్యసన సామాగ్రి (Teaching Learning Material )మహిమ. ఇంటివద్ద రకరకాల డిజిటల్ పరికరాలకు వినోద ప్రక్రియలకు అలవాటు పడిన నేటి తరం పిల్లలు నల్ల బల్ల పై తెల్ల సుద్దముక్క తో అక్షరాలు రాస్తుంటే వాటి వైపు చూడమని ఎంత బతిమలాడినా ఆసక్తి చూపడం లేదు. అందుకని మనం ఇటువంటి బోధనాభ్యసనా సామాగ్రి ని తయారు చేసుకోవడం ఉత్తమం. వీటి వల్ల బోధన సులువు అవుతుంది మరియు విద్యార్థి ఆసక్తి గా నేర్చుకుంటాడు. విద్యార్థి ఆసక్తి ని మన వైపు తిప్పుకున్నాము అంటే మనం ఆ పాఠ్యాంశం బోధనలో సగం విజయం సాధించామని అని నా అభిప్రాయం.

ఇలాంటి సామాగ్రి తయారీలో కష్టం ఉంటుంది. కానీ ఒక సంవత్సరం మనం తయారు చేసుకుంటే మరుసటి సంవత్సరం అవి ఉపయోగపడితే చాలా సులువుగా ఉంటుంది మన బోధనఅభ్యసన ప్రక్రియ.

ఇక అసలు విషయానికి వద్దాము. తెలుగు భాషా బోధన లో అక్షరాల పరిచయానికి, పదాల పరిచయానికి ఫ్లాష్ కార్డులు చక్కగా పనికి వస్తాయి. విద్యార్థులు వాటిని గుర్తించుతారు, వాటిని సరైన క్రమం లో అమర్చి అర్థవంతమైన సరళ పదాలు తయారు చేయగలుగుతారు.

వీటిని తయారు చేయడం కూడా చాలా సులువు. ఒక డ్రాయింగ్ చార్ట్ తీసుకుని దానిని అనేక మడతలు వేసుకోవాలి. పాత తరం పెళ్ళిళ్ళ లో రంగు కాగితాలు డిజైన్ లాగా కత్తిరించడానికి ఎలా మడత పెడతారో అలా అన్నమాట . దానిపైన మన ప్లాస్టర్ ఉంటుంది కదా గుండ్రంగా దానిని పెట్టి పక్కపక్కనే మార్కర్ తో వృత్తాలు గీసుకుని ఆ లైన్ పై కత్తిరిస్తే మనకు కావలసిన గుండ్రటి ఆకారం లో కార్డులు రెడీ అవుతాయి. వాటిపై మనకు కావలసిన అక్షరాలు రాసుకోవచ్చు. అంకెలు కూడా రాసుకోవచ్చు. ఇలా రకరకాల ప్రయోజనాలకు వీటిని వాడుకోవచ్చు. వీటికి కవర్లు వేసినచో కొంచెం ఎక్కువ కాలం మన్నుతాయి.

ఈ కార్డుల తయారీ ని పూర్తిగా ఈ వీడియో లో వివరించాను. చూడండి..

చూశారు కదండీ.. ఈ ఫ్లాష్ కార్డ్ లు ఎలా ఉపయోగపడతాయో, మీరు కూడా నా కన్నా ఇంకా అందంగా తయారు చేసి మీ పిల్లలకు ఆహ్లాద కరమైన వాతావరణం లో బోధిస్తారని ఆశిస్తున్నాను..

ఇట్లు

మీ

పోతురాజు.

గద్దర్ పాటల్లో వాడి తగ్గిందా ?

ప్రజా యుద్ధ నౌక గా పేరు గాంచిన ప్రజాకవి గద్దర్ రచన మరియు గానం తో ఇటీవల విడుదల చేసిన పాట వింటే / చూస్తే సగటు గద్దర్ అభిమానులకు ఈ అనుమానం వచ్చి ఉంటుంది. ఒకప్పటి గద్దర్ వేరు ఇప్పటి గద్దర్ వేరు అని చాలా మంది అనుకుంటున్నారు. దానికి కారణాలు లేకపోలేవు.

గద్దర్ ప్రజా సమస్యలపై రాసిన ఎన్నో పాటలు ఇప్పటికీ ప్రజలను ఉద్యమం వైపు ఉసిగొల్పుతాయి అనడం అతిశయోక్తి కాదు.

బండెనక బండి గట్టి.. పదహారు బండ్లు గట్టి.. ఏ బండ్లె బోతవు కొడుకో .. అని పాడితే నైజాం సర్కారు ఆగడాలు గుర్తుకు తెచ్చుకుని మరీ కోపం తో ఊగిపోయారు ప్రజలు. ..

” ఆగదు ఆగదు ఆగదు .. ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు సాగదు సాగదు .. మీ దోపిడి పాలన సాగదు”… అని పాడుతుంటే రోమాలు నిక్కబొడుచుకునేవి.

“పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా .. పోరు తెలంగాణమా” అని పాడితే యావత్తు తెలంగాణా ప్రజలు తమ గొంతు కలిపి ఉద్యమ సమయం లో ఉర్రూతలూగించారు.. ఉత్తమ గాయకుని గా నంది అవార్డు వచ్చింది..

“నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి బిడ్డలారా .. మీ పాటనై వస్తునానమ్మో .. మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మలారా ..” అని అంటే తెలుగు ప్రజలు కరిగి కన్నీరయిపోయినారు..

“మల్లె తీగకు పందిరివోలె మసక చీకటి వెన్నెల వోలె .. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోబుట్టు ఋణం తీర్చుకుంటనే చెల్లెమ్మా అని అంటే తెలుగు నేల లోని ప్రతి చెల్లెమ్మా మురిసిపోయింది.. ప్రభుత్వం ఉత్తమ రచయిత గా నంది అవార్డు ఇచ్చింది..

“భద్రం కొడుకో నా కొడుకో కొమరన్న జరా భద్రం కొడుకో” అని పాడితే పట్నం బతకడానికి బోయిన ప్రతి కొడుకు, ప్రతి తల్లి నా గురించే రాసిండు గద్దర్ పాట అనుకున్నారు..

మదన సుందారి .. మదన సుందారి .. అన్న పాట ట్యూన్ ఇటీవలి RRR సినిమా లో కొమరం భీముడో పాటకు తీసుకున్నారు అంటే ఆ పాట ఎంత ప్రభావవంతంగా ఉందో ఊహించవచ్చు.. ఇలా చెపుకుంటూ పోతే కొన్ని వందల గద్దర్ పాటలు జనం నోళ్లలో నానుతున్నాయి.

అలాంటి ప్రజా యుధ్ధ నౌక పదును తగ్గిందా ? ఉద్యమం లో ఉన్నప్పుడు ఒక లాగా, ఉద్యమం నుండి బయటకు వచ్చాక మరొక లాగా .. కాంగ్రెస్ పార్టీ లో చేరిన తర్వాత మరొక లాగా ఉంది. మొన్న విడుదల చేసిన బానిసలారా లెండి రా అనే పాట వింటుంటే ఇది గద్దర్ రాసినదేనా అనిపించింది.

గద్దర్ ను విమర్శించే అర్హత నాకు లేకపోయినా ఒక సగటు గద్దర్ అభిమానిగా ఆయన పాటలలో వాడి తగ్గింది అనీ.. ప్రజా సమస్యల పై కాకుండా ఒక పార్టీ కో లేక వ్యక్తి కో సపోర్ట్ చేస్తూ రాసి పాడితే జీర్ణించు కోలేక పోతున్నా.. ఈ ఫీలింగ్ ఉండడం వల్లనే నచ్చడం లేదు కావొచ్చు..

మరి మీకు ఏమి అనిపిస్తుందో ఆది కామెంట్ల రూపం లో చెప్పండి..

మైసూరు ముచ్చట్లు -3

ఇక్కడ చేపలు మరమరాలు తింటున్నాయి

వేకువజామునే శ్రీ రంగనాథ స్వామి ఆలయం దర్శనం అనంతరం మరలా మా మైసూరు చైతన్య రథం బయలుదేరినది. ఇక్కడ నుండి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రివేణి సంగమం వద్దకు మా ప్రయాణం మొదలైంది. పేరు త్రివేణి సంగమం అని తెలుసు కానీ అక్కడ ఏ ఏ నదులు కలుస్తాయి అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు మా నాయకులు వారు తీసుకెళ్తున్నారు మేము వెళుతున్నాము అంతే. తెలుసుకోవాలన్న ఆసక్తి ఉత్సాహం కలిగింది గూగుల్ తల్లి ని అడుగుదాం అనుకున్నా కానీ అంత సమయం దొరకలేదు. రంగనాథ స్వామి దేవాలయం నుండి కేవలం 6.25 కిలో మీటర్ల దూరం లోనే ఉండడం తో త్వరగానే వచ్చేశాము .

selfie at triveni sangama, near mysore.

దిగగానే ఒక నదీ తీరానికి వచ్చేశామా ? అన్న అనుమానం కలిగింది. ఎందుకంటే మన గోదావరి, కృష్ణా నదులను వాటి పరిసరాలను చూసీ చూసీ అలా అలవాటు అయింది కావొచ్చు. బృందావన్ గార్డెన్స్ వద్ద కావేరీ నదిపై డామ్ నిర్మించి పక్కనే పార్కులు మ్యూజికల్ ఫౌంటెన్ రాత్రి పూట చూడడం వల్ల కావేరీ నది నీళ్ళు ఎలా ఉన్నాయో పరిశీలించలేదు కానీ ఇక్కడ మాత్రం స్వచ్ఛంగా కనబడినవి. దూరం నుండే ఈ రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం, నది పరిసరాలను ఎంత పరిశుభ్రంగా ఉంచుతున్నారో అని అచ్చెరువు నొందాను.

అసలే మనం సెల్ఫీ రాజా కావడం తో వెంటనే కెమెరా కు పని చెప్పాను. మెట్ల మీద నుండి కాస్త కిందకి దిగి వీడియో తీశాను. ఫోటోలు తీస్తున్నాను. నది మధ్యలో ఎక్కువ రాళ్ళు, వాటి పై అక్కడక్కడా విగ్రహాలు కనిపించడం విచిత్రంగా అనిపించింది . మన రాష్ట్రం లో చాలా మంది ఇంట్లో పూజ చేసుకునే ఫోటో ఫ్రేమ్ లు కొంచెం పాడైతే కదిలే నీళ్ళలో నిమజ్జనం చేసినట్లు ఇక్కడ విగ్రహాలు ఇలా చేస్తారా అనిపించింది.

కానీ బాహూ బలి లో శివలింగాన్ని జలపాతం కింద ఉంచి ఇక రోజూ నీకు తలస్నానాలే స్వామీ అని అంటాడు కదా ప్రభాస్ అలియాస్ శివుడు(పాత్ర పేరు ). అలాగే ఇక్కడ ఈ విగ్రహాలకు రోజూ అభిషేకాలు జరుగుతాయి అని అనిపించింది. బహుశా రాజ మౌళి ఈ ప్రాంతం చూసి ప్రేరణ పొందాడేమో లేక వీళ్ళే రాజమౌళి బాహుబలి చూసి ఇలా చేశారేమో తెలియదు. బాహుబలి అంటే గుర్తు వచ్చింది, అసలు బాహుబలి విగ్రహం ఉన్న “శ్రావణ బెళగోళ” ప్రాంతం కర్ణాటక రాష్ట్రం లోనే ఉంది. ఆ సినిమా బాహుబలి కి ఈ కన్నడ బాహుబలి విగ్రహానికి సంబంధం లేదు అనుకోండి ఆది వేరే విషయం .

ఇక ఇక్కడ నేను గమనించిన మరో విషయం, ఇక్కడ పిండ ప్రదానాలు చేసి నదిలో వదలడం వాటి తో పాటు మరమరాలు నీళ్ళలో విసిరేయడం , ఆ మరమరాలు చేపలు వచ్చి వెంటనే తినేయడం. మనం పక్షులు వచ్చి మనం పితృ దేవతలకు పెట్టిన ఆహారాన్ని తింటే ఎలా భావిస్తామో ఇక్కడ వీళ్ళు కూడా అలాగే దండం పెట్టుకుంటున్నారు. నాకు వాటిని వీడియో తీయాలనిపించింది. చేపలు మరమరాలు తినే దృశ్యం నా కెమెరాలో బంధించడానికి చాలా ప్రయత్నించాను. కానీ తీరా చూస్తే ఏదో ఆకారం నదిలో బుడగలు వేస్తుంది అని అర్థం అవుతుంది కానీ చేపలు అని స్పష్టంగా తెలియట్లేదు. దానితో వీడియో ను చాలా స్లో మోషన్ చేసి మీకు చూపించడానికి ప్రయత్నించాను.

ఏదోలా తిప్పలు పడి మీకు విషయం వివరించాను. ఇక ఏఏ నదులు ఇక్కడ కలుస్తున్నాయి ? అనే విషయాలు అన్నీ వీడియో లో వివరించాను. ఆసక్తి ఉన్న వారు చూడండి.

సెల్ఫీల కార్యక్రమం కాగానే దగ్గరలో ఉన్న మరొక ఆలయం “నిమిషాంబిక దేవి ఆలయం” నకు వెళ్ళాలి అంటూ అందరం మరలా బయలు దేరి మా మైసూరు చైతన్య రథం ఎక్కాము.

ఇదే మా మైసూరు చైతన్య రథం

అలా మేము తర్వాత గమ్య స్థానం అయిన నిమిషాంబిక దేవి ఆలయం నకు బయలు దేరాము. దీని గురించి రాబోయే ఆర్టికిల్ లో వివరిస్తాను. ఇప్పటాయి వరకు ఓపికగా ఆర్టికిల్ చదివిన మీకందరికీ ధన్యవాదాలు.

మీ

పోతురాజు..

మైసూరు ముచ్చట్లు – 2

మైసూరు బృందావన్ గార్డెన్స్ చూసిన అనుభూతి ఇంకా మరువక ముందే పొద్దుగాల లేచి శ్రీరంగ పట్నం రంగనాథ స్వామి దేవాలయానికి పోతున్నాము. త్వరగా నిద్రపోండి త్వరగా లేవండి అని ఆదేశించారు మా నాయకుల వారు. సరే అనుకుని కార్యశాల విషయాలు ఒకసారి పున:శ్చరణ చేసుకుని మాకు కేటాయించిన వసతి గృహం లోని గది లో నిద్ర కు ఉపక్రమించాము.

ఉదయం వేకువ జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని మైసూరు నుండి 18 కి. మీ ల దూరం లో ఉన్న ఆ రంగనాథుని దర్శనానికై మా మైసూరు చైతన్య రథం లో బయలుదేయరాము.

“ప్రాభాత మంగళ పూజా వేళ

నీ పద సన్నిధి నిలబడి,

నీ పద పీఠిక తలనిడి ,

నిఖిల జగతి నివాళులిడగా ,

వేడగా , కొనియాడగా ,

పాండు రంగ , పాండు రంగ , ఘనా ఘన సుందరా

అంటూ ఘంటసాల వారి పాట వీనుల విందుగా వింటూ కొనసాగింది పయనం.

ఉదయపు వేళ అవడమో లేక విశాలమైన రోడ్లవల్లనో , లేక ట్రాఫిక్ లేకపోవడం వల్లనో తెలియదు గానీ త్వరగానే చేరుకున్నాము.

దూరం నుండే ఎత్తైన గోపురం ఆహా అనిపించింది. ఇది విజయనగర శైలి లో నిర్మించబడినదట .క్రీస్తు శకం 984 లో స్థానిక పశ్చిమ గంగుల నాయకుడు “తిరుమలయ్య ” దీనిని నిర్మించాడని దీనిలో ఉన్న ఒక శాసనం తెలియజేస్తుంది. అలాగే క్రీస్తు శకం 1210 లో హొయసలుల రాజు వీర బల్లాలుడు దీనిని అదనపు నిర్మాణాలు, ఆధునీకరించుట చేశాడని మరొక శాసనం తెలియజేస్తుంది.

ప్రవేశ ద్వారానికి సమీపం లో తులసి మాల, లక్ష్మీ అమ్మ వారికి పూలదండ లు అమ్ముతుంటారు. విగ్రహం పెద్దదిగా ఉండడం వల్ల తులసిమాల బారెడు పొడవున్నది ఇస్తారు. అవి తీసుకుని ఈ గోపురం ద్వారా లోపలికి వెళ్ళాము. అక్కడ దర్శనం కోసం వేచి చూస్తూ లోపలి మండపం లోని స్తంభాలు, శిల్పాలు చూస్తూ ఉండగానే అభిషేకాలు పూర్తి అయి దర్శనానికి అందరినీ అనుమతించారు. ఆదిశేషుని పానుపు గా చేసుకుని ఉన్న విష్ణుమూర్తి భారీ విగ్రహం గది నిండా దర్శనం ఇచ్చింది. ఇచ్చిన తులసి మాల ను స్వామి వారి పాదాల చెంతకు పూజారి విసిరేసినట్లే అనిపించింది. తీరా చూస్తే స్వామి వారి పాదాలపై అలా దండలాగా పడింది. బహుశా అనుభవం వల్ల కావొచ్చు. మరోసారి నమస్కరించుకుని బయటకు వచ్చి లక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ పూల మాలలు ఇచ్చాము. ఈ సారి పూజారి విసిరేయలేదు. అలంకరించారు. బహుశా విగ్రహం చిన్నది కావడం వల్ల కావొచ్చు..ఇక బయటకి వచ్చి బయటి మండపంలో ఫోటోలు దిగాము.

ఇంకా బయటకి వచ్చి చూడగా చుట్టూ విశాలమైన ప్రాంగణం, ఒక రాతి స్తంభాల మంటపం, రాతి తో కట్టబడిన తులసి కోట, హోమ గుండం, కనిపించాయి. మన దేవాలయాలలో హోమగుండం భూమికి కొంచెం ఎత్తులో కనిపిస్తే, ఇక్కడ భూమి లోపలికి మెట్ల బావి లాగా కనిపించాయి .

ఫోటోలు దిగి బయటకు వచ్చి అక్కడ అప్పుడే తెరచి మా కోసమే వేచి చూస్తూ ఉన్న హోటల్ దగ్గర చక్కటి చిక్కటి టీ ఒకటి తగినాము. అటువైపు గా చూస్తే గుర్రాలు గుగ్గిళ్ళు తింటున్నాయి కాబోలు. మూతికి కవర్లు అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఏమి తింటున్నాయో అర్థం కాలేదు. తెలుసుకోవాలనే ఆసక్తి తో మొబైల్ చేతిలో పట్టుకుని వాటిని వీడియో చూస్తూ ముందుకెళ్ళాను. “ప్రవీణ్ త్వరగా రా “కావేరీ సంగమ” కి వెళ్ళాలి అన్న పిలుపో అరుపో తెలియదు గానీ చెవులను తాకింది. చేతులు అప్రయత్నంగా వీడియో ఆపు చేసి మొబైల్ లోపల పెట్టాయి. కాళ్ళు నాకు తెలియకుండానే వెనక్కి మళ్ళి మా మైసూరు చైతన్య రథం వైపుకు పరుగులు తీసాయి.

ఇక్కడ ఈ శ్రీరంగపట్నం దేవాలయం వీడియో ఇస్తున్నాను ఓపిక ఉన్నవారు , ఆసక్తి ఉన్నవారు చూడండి.

చూశారా ఇక త్వరగా రండి కావేరీ సంగమం కి వెళ్దాము. ఓ క్షమించండి కావేరీ సంగమ గురించి వచ్చే ఆర్టికిల్ లోవివరిస్తాను.

ఇంత ఓపికగా ఈ ఆర్టికిల్ చదివిందుకు కృతజ్ఞతలు. మరింత ఓపికగా కామెంట్లు కూడా రాస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ రోజికి ఇంతే ..

ఇట్లు

మీ

పోతురాజు

మైసూరు ముచ్చట్లు- 1

మండు వేసవి నుండి చిరు జల్లుల తొలకరికి ప్రకృతి మారే వేళ , నా బడి పిల్లల కిలకిలలు, కేరింతలు, గుసగుసలు, రుసరుసలు వంటి వాటికి అన్నిటికీ దూరంగా, తొలి సారి రాష్ట్రం బయట పలు రాష్ట్రాల ఉపాధ్యాయుల తో కలిసి పని చేసేటందుకు మొదలైంది నా పయనం.

రైలు ప్రయాణం కొత్త కానప్పటికీ, తోటి ఉపాధ్యాయులు, పాఠ్య పుస్తక రచయితలు, స్టేట్ రిసోర్స్ గ్రూప్ మెంబర్స్ కావడం తో ఒకింత బెరుకుగా నే ఉంది. కానీ రైలు ప్రయాణం మొదలైన గంట రెండు గంటల లోనే ఒకే కుటుంబం లోని సభ్యుల లాగా కలిసి పోవడం తో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను.

మెల్లగా మొదలైన సంభాషణలు, చర్చలు, ప్రణాళికలు కొంత సమయం వరకు కొనసాగాయి. రాత్రి ప్రయాణం కావడం తో ఉదయం లేచి దంత ధావనం, ముఖ ప్రక్షాళన గావించే సరికి (అదేనండీ పండ్లు తోముకునుట , మొఖం కడుక్కునుట ) మైసూరు వచ్చేసింది.

రైలు దిగి మా వర్క్ షాప్ కార్యశాల స్థలం అయిన RIE MYSORE కు చేరుకునేందుకు ఆటో లో పయనం షురూ అయింది. ఆటో లో నుండి చూస్తే అన్నీ చెట్లు, విశాలమైన రోడ్లు పరిశుభ్రంగా ఉన్న పరిసరాలు చూసి ఇది మన దేశమేనా అన్న అనుమానం కలిగింది సుమీ. చల్లని గాలి మేను తాకింది, పరవశించే లోపు కార్యశాల స్థలం వచ్చేసింది. రిజిష్ట్రేషన్ లు పూర్తి చేసుకుని పని మొదలు పెట్టాము. కార్యశాల పనులు ఈ రోజుకి ముగిసాయి. సాయంత్రం వీలు చూసుకుని బృందావన్ గార్డెన్స్ చూడడానికి వెళ్తున్నాం అన్నారు మా నాయకుల వారు. అవునా వెళ్తున్నామా ? అనుకున్నాను నేను.

ఆయన అనుభవాన్ని, పరిచయాలను ఉపయోగించి వాహన సదుపాయం ఒకింత తక్కువ లో ఏర్పాటు చేశారు. అందరం ఆసక్తి చూపడం, భాగస్వాములు కావడం తో సాయంకాల సమయం లో బృందావన విహారానికి మా మైసూరు చైతన్య రథం బయలుదేరింది. మైసూరు నుండి 12 కిలోమీటర్ల ప్రయాణం, 20 నిమిషాలలో గమ్యం చేరుకున్నాము.

కావేరీ నదికి అడ్డంగా అంత ఎత్తున డ్యామ్ ఎలా కట్టారో, దాని పక్కనే ఇన్ని లక్షలమంది చూడడానికి వస్తున్న ఈ బృందావన్ గార్డెన్ ఎలా నిర్మించారో, వివిధ ఎత్తులలో అంచెలంచలుగా మొక్కలు ఎలా డిజైన్ చేశారో, వివిధ ఎత్తులలో ఫౌంటెన్ లు నాట్యమాడుతుంటే , ఆశ్చర్యం,అద్భుతం, సంభ్రమం , వంటి పదాల కంటే గొప్పగా వర్ణించడానికి పదాలు వెతుక్కునేంత అనుభూతి పొందాను. సాయంకాలం రంగురంగుల LED దీపాలు, జలపాతాల హోరు, సంగీతాల జోరు, వెరసి మ్యూజికల్ ఫౌంటేన్ షో ఓ మరపురాని అనుభూతిని, ఆశ్చర్యాన్ని ఇచ్చింది అంటే అతిశయోక్తి కాదు.

1927 లో నిర్మాణం ప్రారంభమై, 1932 కి పూర్తి చేసుకున్న కృష్ణ రాజా సాగర డ్యామ్ 1,20,000 ఎకరాలకు నీరు అందిస్తుంది. ప్రతి ఏటా సుమారు 2 మిలియన్ల మంది దీనిని సందర్శిస్తున్నారు. 1980-90 దశకాలలో బోలెడన్ని సినిమాల షూటింగ్ లు ఇక్కడ జరిగాయి . ఇన్ని విశేషాలు కలిగిన బృందావన్ గార్డెన్స్ యొక్క అందాలు మీరూ చూడాలంటే ఈ క్రింది వీడియో ను చూడండి.

1927 లో నిర్మాణం ప్రారంభమై, 1932 కి పూర్తి చేసుకున్న కృష్ణ రాజా సాగర డ్యామ్ 1,20,000 ఎకరాలకు నీరు అందిస్తుంది. ప్రతి ఏటా సుమారు 2 మిలియన్ల మంది దీనిని సందర్శిస్తున్నారు. 1980,90 దశకాలలో బోలెడన్ని సినిమాల షూటింగ్ లు ఇక్కడ జరిగాయి . ఇన్ని విశేషాలు కలిగిన బృందావన్ గార్డెన్స్ యొక్క అందాలు మీరూ చూడాలంటే ఈ క్రింది వీడియో ను చూడండి.

ఇంకా మైసూరు లో నేను చూసిన అన్ని ప్రదేశాల గురించి సవివరంగా మీకు త్వరలో వివరించబోతున్నాను. ఈ రోజుల్లో కూడా ఇంత ఓపికగా ఈ ఆర్టికిల్ పూర్తిగా చదివిన మీకందరికీ వందనాలు..

విద్యార్థుల దృష్టి ఎలా ఆకర్షించాలి ?

                                             ఆండ్రాయిడ్ డివైజ్ లేనిదే అన్నం కూడా తినని స్టేజ్ కి ఇవాళ రేపు పిల్లలు తయారయ్యారు. 2 నుండి 5 సంవత్సరాల పిల్లలు వివిధ రకాల కార్టూన్ ఛానెల్స్ కి , యూ ట్యూబ్ ఛానెల్స్ కి కార్టూన్ వీడియోలకు, కథలకు, అనేక రకాల ఆప్ లకు అలవాటు పడ్డారు. ఆండ్రాయిడ్ ఫోన్ లో మనకు తెలియని అనేక ఆప్షన్స్ పిల్లలకు తెలుస్తున్నాయి.

                                                       ఇటువంటి పిల్లల ఆసక్తి ని నల్ల బల్ల పై తెల్లటి అక్షరాలు రాస్తూ వారిని బోర్డు వైపు చూడండి అని ఎంత అరిచినా , బతిమిలాడినా చూడడం గగనమైపోతుంది. మరి ఉవాధ్యాయులుగా మనం ఏమి చేసి వారి దృష్టిని మన వైపుకు ఆకర్షించాలి? ఎలా బోధన అభ్యసన కృత్యాలు వారితో చేయించాలి ? విద్యార్థులు ఆనందంగా ఆహ్లాదకరంగా నేర్చుకోవాలంటే  మనం ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం ..

మనం కూడా వారి దారిలోనే వెళ్దాం .. డిజిటల్ పద్ధతి ఆకళింపు చేసుకుందాం    

                                   డిజిటల్ పద్ధతి లోనే బోధించుదాం… పాఠానికి తగినట్లుగా సృజనాత్మకంగా  power point presentation తయారు చేసి బోధించుదాం. వీడియోలు రికార్డు చేసి బోధించుదాం. వీడియోలు డౌన్ లోడ్ చేసి ప్రదర్శించుదాం.

డిజిటల్ బోధన లాభాలు- నష్టాలు :

Visualization of the Concept :  “ఒక పురాతన సామెత ప్రకారం పది వేల పదాల ద్వారా వివరించలేనిది ఒక చక్కని చిత్రం ద్వారా వివరించ వచ్చు .” అలా మనం  భావనలు సులభంగా అర్థం అయ్యే విధంగా చెప్పవచ్చు. ఉదాహరణ కు : కూడికలు, తీసివేతలు , అక్షరాలు, అక్షరాల క్రమ అమరిక ద్వారా పదాల ఏర్పాటు , స్థాన విలువలు వంటి సులభ భావనల నుండి సౌర కుటుంబం , సూర్య, చంద్ర గ్రహణాలు, మానవుని లోపల శరీర భాగాలు రక్త ప్రసరణ , జీర్ణక్రియ, నాడీ వ్యవస్థ వంటి క్లిష్ట భావనల వరకు దేనినైనా  సులభంగా వివరించవచ్చు.

Remedial Teaching  :  “C “ గ్రేడ్ విద్యార్థులకు మరలా మరలా బోధించుటకు ఇలా రికార్డు చేసి పెట్టుకున్న వీడియోలు మళ్ళీ మళ్ళీ ప్రదర్శన చేయవచ్చు. ఒక్క సారి సిలబస్ అంతా ఇలా క్రియేటివ్ వీడియోలు తయారు చేసుకున్నా లేక సేకరించి పెట్టుకున్నా ఇవ్వి సిలబస్ మారేంత వరకు ఉపయోగపడును.

Self-Learning of  student: విద్యార్థి ఇంటి వద్ద సాధన చేయుటకు ఉపయోగపడును. యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసినచో విద్యార్థి తల్లిదండ్రులకు వీలున్న సమయంలో  చూపించ వచ్చు. ఇలా విద్యార్థి స్వీయ అభ్యసన కు తోడ్పడుతుంది.

నష్టాలు :  విద్యార్థులు  ఇతర వ్యాపకాలు అనగా గేమ్స్ , ఇంకా ఇతర వాటి వైపు దృష్టి మరలే అవకాశం ఉంది. కావున తల్లి దండ్రుల సమక్షం లో కేవలం అభ్యసన కు మాత్రమే ఉపయోగించాలి.

                 “Technology is not alternate for teacher it is just support for teacher” కావున ఉపాధ్యాయుడు అవసరం మేరకు ఈ వీడియోలు ప్రదర్శిస్తూ మధ్యలో రిమోట్ సాయం తో పాజ్ చేసి అదనపు పాయింట్లు జోడిస్తూ  బోధన చేస్తే బాగుంటుంది.

డిజిటల్ బోధనకు  మనకు ఏమి పరికరాలు అవసరం ?

మొబైల్ ఫోన్ :విద్యార్థుల సంఖ్య ను బట్టి 10 లోపు విద్యార్థులకు మన మొబైల్ ఫోన్ సరిపోతుంది. కానీ అది ఆచరణ యోగ్యం కాదు అని నేనంటాను. ఎందుకంటే  పాఠం మధ్యలో ఉన్నపుడు ఫోన్ మోగినా , వీడియో ప్రదర్శన ఆగిపోతుంది. పిల్లలు నాకు కనబడుటలేదు అని నెట్టుకొనడం లాంటి వాటి వలన మొబైల్ కింద పడే అవకాశం ఉంది. ఇలాంటి వాటి వలన  ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు ఇద్దరికీ ఇబ్బంది .  

టెలివిజన్ : 20 మంది విద్యార్థులకు ఇది ఉపయోగకరం. దీనికి కూడా సౌండ్ క్లారిటీ గా ఉండడం కోసం ఒక వూఫర్ మరియు సౌండ్ బాక్స్ లు పెట్టినచో  బాగుంటుంది.

కంప్యూటర్ : ఇది కూడా 10 నుండి 20 మంది విద్యార్థులకు ఉపయోగకరం. దీనికి కూడా సౌండ్ బాక్స్ లేదా స్పీకర్ లు అవసరం.

ప్రొజెక్టర్ : ఇది 30- 40  మంది విద్యార్థులకు ఉపయోగకరం. . దీకి కూడా సౌండ్ బాక్స్ లేదా స్పీకర్ లు అవసరం.

 డిజిటల్ బోధనకు మనకు కావలసిన సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి ?

                          డిజిటల్ బోధనకు  ముఖ్యంగా  Power Point Presentation , Screen Recording, Video Editing. నేర్చుకుంటే సరిపోతుంది.  Power Point Presentation క్రియేటివ్ గా చేయుటకు కొన్ని కంప్యూటర్ బేసిక్స్ మరియు డౌన్ లోడ్ బేసిక్స్ మరియు ఆన్ లైన్ తరగతుల నిర్వహణ మరియు ఆన్ లైన్ పరీక్షల నిర్వహణ వంటి ఇతర పరిజ్ఞానం నేర్చుకుంటే పూర్తి డిజిటల్ టీచర్ గా మారవచ్చు.

ఎలా నేర్చుకుందాం ?

Google  తల్లి  అన్నీ నేర్పిస్తుంది. యూ ట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు. అన్ని విషయాలు నేర్చుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ నేర్చుకున్న అనంతరం మీ నైపుణ్యాలు తదుపరి జనరేషన్ పిల్లలకు విద్య వారి మార్గం లో వెళ్ళి  బోధించుటకు అనువుగా ఉంటాయి.

మర్జాల నీతి – మర్కట నీతి :

                              మార్జాలం అంటే పిల్లి . పిల్లి తన పిల్లలను నోట కరచుకొని ఏడు ఇల్లులూ తిరుగుతుంది. పిల్లలకు ఏమీ కాకుండా జాగ్రత్తగా చూసుకోవడం తల్లి బాధ్యత. అంతా తల్లే చూసుకోవాలి.

                           మర్కటం అంటే కోతి . కోతి కూడా తన పిల్లలను ఇల్లిల్లూ తిప్పుతుంది . కానీ ఇక్కడ కోతి పిల్లల దే అంతా బాధ్యత. కిందపడకుండా పట్టుకోవాల్సిన బాధ్యత కోతి పిల్లలదే.  

ఎవరో ఒక గురువు వద్ద నేర్చుకుంటే  మార్జల నీతి వర్తిస్తుంది. లేదా స్వీయ అభ్యాసననికి మర్కట నీతి .

 ఇలా ఒక వేళ మీరు నేర్చుకోవాలంటే :   నేను మీకోసం నా 3 సంవత్సరాల డిజిటల్ బోధనా అనుభవాలను అన్నీ కలిపి కొన్ని కోర్సులు క్రియేట్ చేశాను.

  1. Digital Teachers Mastery : 20 రోజులు ఆన్ లైన్ క్లాసులు రోజూ  90 నిమిషాలు జూమ్ లో క్లాసులు
  2. Video Making Crash Course : 10 రోజుల క్రాష్ కోర్స్ రోజూ 90 నిమిషాలు జూమ్ లో క్లాసులు

పూర్తి వివరాల కోసం  : https://prawinsacademy.winuall.com/

 మరియు సందర్శించండి : https://prawinsacademy.winuall.com/store

ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే  WhatsApp ద్వారా సంప్రదించాల్సిన  నంబర్ : 7893938702  

మా డిజిటల్ బోధనా వీడియోలను చూడడానికి :

మీరు డిజిటల్ బోధనా పద్ధతులు నేర్చుకుని మీ బోధనను కొత్త పుంతలు తొక్కిస్తారని ఆశిస్తున్నాను.

గమనిక: జూన్ 15 నుండి నూతన బ్యాచ్ లు ప్రారంభం. 15 లోపు రిజిస్టర్ చేసుకున్న వారికి బోనస్ గా రెండు మొబైల్ based courses free .