గద్దర్ పాటల్లో వాడి తగ్గిందా ?

ప్రజా యుద్ధ నౌక గా పేరు గాంచిన ప్రజాకవి గద్దర్ రచన మరియు గానం తో ఇటీవల విడుదల చేసిన పాట వింటే / చూస్తే సగటు గద్దర్ అభిమానులకు ఈ అనుమానం వచ్చి ఉంటుంది. ఒకప్పటి గద్దర్ వేరు ఇప్పటి గద్దర్ వేరు అని చాలా మంది అనుకుంటున్నారు. దానికి కారణాలు లేకపోలేవు.

గద్దర్ ప్రజా సమస్యలపై రాసిన ఎన్నో పాటలు ఇప్పటికీ ప్రజలను ఉద్యమం వైపు ఉసిగొల్పుతాయి అనడం అతిశయోక్తి కాదు.

బండెనక బండి గట్టి.. పదహారు బండ్లు గట్టి.. ఏ బండ్లె బోతవు కొడుకో .. అని పాడితే నైజాం సర్కారు ఆగడాలు గుర్తుకు తెచ్చుకుని మరీ కోపం తో ఊగిపోయారు ప్రజలు. ..

” ఆగదు ఆగదు ఆగదు .. ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు సాగదు సాగదు .. మీ దోపిడి పాలన సాగదు”… అని పాడుతుంటే రోమాలు నిక్కబొడుచుకునేవి.

“పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా .. పోరు తెలంగాణమా” అని పాడితే యావత్తు తెలంగాణా ప్రజలు తమ గొంతు కలిపి ఉద్యమ సమయం లో ఉర్రూతలూగించారు.. ఉత్తమ గాయకుని గా నంది అవార్డు వచ్చింది..

“నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి బిడ్డలారా .. మీ పాటనై వస్తునానమ్మో .. మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మలారా ..” అని అంటే తెలుగు ప్రజలు కరిగి కన్నీరయిపోయినారు..

“మల్లె తీగకు పందిరివోలె మసక చీకటి వెన్నెల వోలె .. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోబుట్టు ఋణం తీర్చుకుంటనే చెల్లెమ్మా అని అంటే తెలుగు నేల లోని ప్రతి చెల్లెమ్మా మురిసిపోయింది.. ప్రభుత్వం ఉత్తమ రచయిత గా నంది అవార్డు ఇచ్చింది..

“భద్రం కొడుకో నా కొడుకో కొమరన్న జరా భద్రం కొడుకో” అని పాడితే పట్నం బతకడానికి బోయిన ప్రతి కొడుకు, ప్రతి తల్లి నా గురించే రాసిండు గద్దర్ పాట అనుకున్నారు..

మదన సుందారి .. మదన సుందారి .. అన్న పాట ట్యూన్ ఇటీవలి RRR సినిమా లో కొమరం భీముడో పాటకు తీసుకున్నారు అంటే ఆ పాట ఎంత ప్రభావవంతంగా ఉందో ఊహించవచ్చు.. ఇలా చెపుకుంటూ పోతే కొన్ని వందల గద్దర్ పాటలు జనం నోళ్లలో నానుతున్నాయి.

అలాంటి ప్రజా యుధ్ధ నౌక పదును తగ్గిందా ? ఉద్యమం లో ఉన్నప్పుడు ఒక లాగా, ఉద్యమం నుండి బయటకు వచ్చాక మరొక లాగా .. కాంగ్రెస్ పార్టీ లో చేరిన తర్వాత మరొక లాగా ఉంది. మొన్న విడుదల చేసిన బానిసలారా లెండి రా అనే పాట వింటుంటే ఇది గద్దర్ రాసినదేనా అనిపించింది.

గద్దర్ ను విమర్శించే అర్హత నాకు లేకపోయినా ఒక సగటు గద్దర్ అభిమానిగా ఆయన పాటలలో వాడి తగ్గింది అనీ.. ప్రజా సమస్యల పై కాకుండా ఒక పార్టీ కో లేక వ్యక్తి కో సపోర్ట్ చేస్తూ రాసి పాడితే జీర్ణించు కోలేక పోతున్నా.. ఈ ఫీలింగ్ ఉండడం వల్లనే నచ్చడం లేదు కావొచ్చు..

మరి మీకు ఏమి అనిపిస్తుందో ఆది కామెంట్ల రూపం లో చెప్పండి..

Leave a Reply

Your email address will not be published.