మైసూరు ముచ్చట్లు – 2

మైసూరు బృందావన్ గార్డెన్స్ చూసిన అనుభూతి ఇంకా మరువక ముందే పొద్దుగాల లేచి శ్రీరంగ పట్నం రంగనాథ స్వామి దేవాలయానికి పోతున్నాము. త్వరగా నిద్రపోండి త్వరగా లేవండి అని ఆదేశించారు మా నాయకుల వారు. సరే అనుకుని కార్యశాల విషయాలు ఒకసారి పున:శ్చరణ చేసుకుని మాకు కేటాయించిన వసతి గృహం లోని గది లో నిద్ర కు ఉపక్రమించాము.

ఉదయం వేకువ జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని మైసూరు నుండి 18 కి. మీ ల దూరం లో ఉన్న ఆ రంగనాథుని దర్శనానికై మా మైసూరు చైతన్య రథం లో బయలుదేయరాము.

“ప్రాభాత మంగళ పూజా వేళ

నీ పద సన్నిధి నిలబడి,

నీ పద పీఠిక తలనిడి ,

నిఖిల జగతి నివాళులిడగా ,

వేడగా , కొనియాడగా ,

పాండు రంగ , పాండు రంగ , ఘనా ఘన సుందరా

అంటూ ఘంటసాల వారి పాట వీనుల విందుగా వింటూ కొనసాగింది పయనం.

ఉదయపు వేళ అవడమో లేక విశాలమైన రోడ్లవల్లనో , లేక ట్రాఫిక్ లేకపోవడం వల్లనో తెలియదు గానీ త్వరగానే చేరుకున్నాము.

దూరం నుండే ఎత్తైన గోపురం ఆహా అనిపించింది. ఇది విజయనగర శైలి లో నిర్మించబడినదట .క్రీస్తు శకం 984 లో స్థానిక పశ్చిమ గంగుల నాయకుడు “తిరుమలయ్య ” దీనిని నిర్మించాడని దీనిలో ఉన్న ఒక శాసనం తెలియజేస్తుంది. అలాగే క్రీస్తు శకం 1210 లో హొయసలుల రాజు వీర బల్లాలుడు దీనిని అదనపు నిర్మాణాలు, ఆధునీకరించుట చేశాడని మరొక శాసనం తెలియజేస్తుంది.

ప్రవేశ ద్వారానికి సమీపం లో తులసి మాల, లక్ష్మీ అమ్మ వారికి పూలదండ లు అమ్ముతుంటారు. విగ్రహం పెద్దదిగా ఉండడం వల్ల తులసిమాల బారెడు పొడవున్నది ఇస్తారు. అవి తీసుకుని ఈ గోపురం ద్వారా లోపలికి వెళ్ళాము. అక్కడ దర్శనం కోసం వేచి చూస్తూ లోపలి మండపం లోని స్తంభాలు, శిల్పాలు చూస్తూ ఉండగానే అభిషేకాలు పూర్తి అయి దర్శనానికి అందరినీ అనుమతించారు. ఆదిశేషుని పానుపు గా చేసుకుని ఉన్న విష్ణుమూర్తి భారీ విగ్రహం గది నిండా దర్శనం ఇచ్చింది. ఇచ్చిన తులసి మాల ను స్వామి వారి పాదాల చెంతకు పూజారి విసిరేసినట్లే అనిపించింది. తీరా చూస్తే స్వామి వారి పాదాలపై అలా దండలాగా పడింది. బహుశా అనుభవం వల్ల కావొచ్చు. మరోసారి నమస్కరించుకుని బయటకు వచ్చి లక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ పూల మాలలు ఇచ్చాము. ఈ సారి పూజారి విసిరేయలేదు. అలంకరించారు. బహుశా విగ్రహం చిన్నది కావడం వల్ల కావొచ్చు..ఇక బయటకి వచ్చి బయటి మండపంలో ఫోటోలు దిగాము.

ఇంకా బయటకి వచ్చి చూడగా చుట్టూ విశాలమైన ప్రాంగణం, ఒక రాతి స్తంభాల మంటపం, రాతి తో కట్టబడిన తులసి కోట, హోమ గుండం, కనిపించాయి. మన దేవాలయాలలో హోమగుండం భూమికి కొంచెం ఎత్తులో కనిపిస్తే, ఇక్కడ భూమి లోపలికి మెట్ల బావి లాగా కనిపించాయి .

ఫోటోలు దిగి బయటకు వచ్చి అక్కడ అప్పుడే తెరచి మా కోసమే వేచి చూస్తూ ఉన్న హోటల్ దగ్గర చక్కటి చిక్కటి టీ ఒకటి తగినాము. అటువైపు గా చూస్తే గుర్రాలు గుగ్గిళ్ళు తింటున్నాయి కాబోలు. మూతికి కవర్లు అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఏమి తింటున్నాయో అర్థం కాలేదు. తెలుసుకోవాలనే ఆసక్తి తో మొబైల్ చేతిలో పట్టుకుని వాటిని వీడియో చూస్తూ ముందుకెళ్ళాను. “ప్రవీణ్ త్వరగా రా “కావేరీ సంగమ” కి వెళ్ళాలి అన్న పిలుపో అరుపో తెలియదు గానీ చెవులను తాకింది. చేతులు అప్రయత్నంగా వీడియో ఆపు చేసి మొబైల్ లోపల పెట్టాయి. కాళ్ళు నాకు తెలియకుండానే వెనక్కి మళ్ళి మా మైసూరు చైతన్య రథం వైపుకు పరుగులు తీసాయి.

ఇక్కడ ఈ శ్రీరంగపట్నం దేవాలయం వీడియో ఇస్తున్నాను ఓపిక ఉన్నవారు , ఆసక్తి ఉన్నవారు చూడండి.

చూశారా ఇక త్వరగా రండి కావేరీ సంగమం కి వెళ్దాము. ఓ క్షమించండి కావేరీ సంగమ గురించి వచ్చే ఆర్టికిల్ లోవివరిస్తాను.

ఇంత ఓపికగా ఈ ఆర్టికిల్ చదివిందుకు కృతజ్ఞతలు. మరింత ఓపికగా కామెంట్లు కూడా రాస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ రోజికి ఇంతే ..

ఇట్లు

మీ

పోతురాజు

Leave a Reply

Your email address will not be published.