మైసూరు ముచ్చట్లు -3

ఇక్కడ చేపలు మరమరాలు తింటున్నాయి

వేకువజామునే శ్రీ రంగనాథ స్వామి ఆలయం దర్శనం అనంతరం మరలా మా మైసూరు చైతన్య రథం బయలుదేరినది. ఇక్కడ నుండి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రివేణి సంగమం వద్దకు మా ప్రయాణం మొదలైంది. పేరు త్రివేణి సంగమం అని తెలుసు కానీ అక్కడ ఏ ఏ నదులు కలుస్తాయి అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు మా నాయకులు వారు తీసుకెళ్తున్నారు మేము వెళుతున్నాము అంతే. తెలుసుకోవాలన్న ఆసక్తి ఉత్సాహం కలిగింది గూగుల్ తల్లి ని అడుగుదాం అనుకున్నా కానీ అంత సమయం దొరకలేదు. రంగనాథ స్వామి దేవాలయం నుండి కేవలం 6.25 కిలో మీటర్ల దూరం లోనే ఉండడం తో త్వరగానే వచ్చేశాము .

selfie at triveni sangama, near mysore.

దిగగానే ఒక నదీ తీరానికి వచ్చేశామా ? అన్న అనుమానం కలిగింది. ఎందుకంటే మన గోదావరి, కృష్ణా నదులను వాటి పరిసరాలను చూసీ చూసీ అలా అలవాటు అయింది కావొచ్చు. బృందావన్ గార్డెన్స్ వద్ద కావేరీ నదిపై డామ్ నిర్మించి పక్కనే పార్కులు మ్యూజికల్ ఫౌంటెన్ రాత్రి పూట చూడడం వల్ల కావేరీ నది నీళ్ళు ఎలా ఉన్నాయో పరిశీలించలేదు కానీ ఇక్కడ మాత్రం స్వచ్ఛంగా కనబడినవి. దూరం నుండే ఈ రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం, నది పరిసరాలను ఎంత పరిశుభ్రంగా ఉంచుతున్నారో అని అచ్చెరువు నొందాను.

అసలే మనం సెల్ఫీ రాజా కావడం తో వెంటనే కెమెరా కు పని చెప్పాను. మెట్ల మీద నుండి కాస్త కిందకి దిగి వీడియో తీశాను. ఫోటోలు తీస్తున్నాను. నది మధ్యలో ఎక్కువ రాళ్ళు, వాటి పై అక్కడక్కడా విగ్రహాలు కనిపించడం విచిత్రంగా అనిపించింది . మన రాష్ట్రం లో చాలా మంది ఇంట్లో పూజ చేసుకునే ఫోటో ఫ్రేమ్ లు కొంచెం పాడైతే కదిలే నీళ్ళలో నిమజ్జనం చేసినట్లు ఇక్కడ విగ్రహాలు ఇలా చేస్తారా అనిపించింది.

కానీ బాహూ బలి లో శివలింగాన్ని జలపాతం కింద ఉంచి ఇక రోజూ నీకు తలస్నానాలే స్వామీ అని అంటాడు కదా ప్రభాస్ అలియాస్ శివుడు(పాత్ర పేరు ). అలాగే ఇక్కడ ఈ విగ్రహాలకు రోజూ అభిషేకాలు జరుగుతాయి అని అనిపించింది. బహుశా రాజ మౌళి ఈ ప్రాంతం చూసి ప్రేరణ పొందాడేమో లేక వీళ్ళే రాజమౌళి బాహుబలి చూసి ఇలా చేశారేమో తెలియదు. బాహుబలి అంటే గుర్తు వచ్చింది, అసలు బాహుబలి విగ్రహం ఉన్న “శ్రావణ బెళగోళ” ప్రాంతం కర్ణాటక రాష్ట్రం లోనే ఉంది. ఆ సినిమా బాహుబలి కి ఈ కన్నడ బాహుబలి విగ్రహానికి సంబంధం లేదు అనుకోండి ఆది వేరే విషయం .

ఇక ఇక్కడ నేను గమనించిన మరో విషయం, ఇక్కడ పిండ ప్రదానాలు చేసి నదిలో వదలడం వాటి తో పాటు మరమరాలు నీళ్ళలో విసిరేయడం , ఆ మరమరాలు చేపలు వచ్చి వెంటనే తినేయడం. మనం పక్షులు వచ్చి మనం పితృ దేవతలకు పెట్టిన ఆహారాన్ని తింటే ఎలా భావిస్తామో ఇక్కడ వీళ్ళు కూడా అలాగే దండం పెట్టుకుంటున్నారు. నాకు వాటిని వీడియో తీయాలనిపించింది. చేపలు మరమరాలు తినే దృశ్యం నా కెమెరాలో బంధించడానికి చాలా ప్రయత్నించాను. కానీ తీరా చూస్తే ఏదో ఆకారం నదిలో బుడగలు వేస్తుంది అని అర్థం అవుతుంది కానీ చేపలు అని స్పష్టంగా తెలియట్లేదు. దానితో వీడియో ను చాలా స్లో మోషన్ చేసి మీకు చూపించడానికి ప్రయత్నించాను.

ఏదోలా తిప్పలు పడి మీకు విషయం వివరించాను. ఇక ఏఏ నదులు ఇక్కడ కలుస్తున్నాయి ? అనే విషయాలు అన్నీ వీడియో లో వివరించాను. ఆసక్తి ఉన్న వారు చూడండి.

సెల్ఫీల కార్యక్రమం కాగానే దగ్గరలో ఉన్న మరొక ఆలయం “నిమిషాంబిక దేవి ఆలయం” నకు వెళ్ళాలి అంటూ అందరం మరలా బయలు దేరి మా మైసూరు చైతన్య రథం ఎక్కాము.

ఇదే మా మైసూరు చైతన్య రథం

అలా మేము తర్వాత గమ్య స్థానం అయిన నిమిషాంబిక దేవి ఆలయం నకు బయలు దేరాము. దీని గురించి రాబోయే ఆర్టికిల్ లో వివరిస్తాను. ఇప్పటాయి వరకు ఓపికగా ఆర్టికిల్ చదివిన మీకందరికీ ధన్యవాదాలు.

మీ

పోతురాజు..

Leave a Reply

Your email address will not be published.