మైసూరు ముచ్చట్లు- 1

మండు వేసవి నుండి చిరు జల్లుల తొలకరికి ప్రకృతి మారే వేళ , నా బడి పిల్లల కిలకిలలు, కేరింతలు, గుసగుసలు, రుసరుసలు వంటి వాటికి అన్నిటికీ దూరంగా, తొలి సారి రాష్ట్రం బయట పలు రాష్ట్రాల ఉపాధ్యాయుల తో కలిసి పని చేసేటందుకు మొదలైంది నా పయనం.

రైలు ప్రయాణం కొత్త కానప్పటికీ, తోటి ఉపాధ్యాయులు, పాఠ్య పుస్తక రచయితలు, స్టేట్ రిసోర్స్ గ్రూప్ మెంబర్స్ కావడం తో ఒకింత బెరుకుగా నే ఉంది. కానీ రైలు ప్రయాణం మొదలైన గంట రెండు గంటల లోనే ఒకే కుటుంబం లోని సభ్యుల లాగా కలిసి పోవడం తో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను.

మెల్లగా మొదలైన సంభాషణలు, చర్చలు, ప్రణాళికలు కొంత సమయం వరకు కొనసాగాయి. రాత్రి ప్రయాణం కావడం తో ఉదయం లేచి దంత ధావనం, ముఖ ప్రక్షాళన గావించే సరికి (అదేనండీ పండ్లు తోముకునుట , మొఖం కడుక్కునుట ) మైసూరు వచ్చేసింది.

రైలు దిగి మా వర్క్ షాప్ కార్యశాల స్థలం అయిన RIE MYSORE కు చేరుకునేందుకు ఆటో లో పయనం షురూ అయింది. ఆటో లో నుండి చూస్తే అన్నీ చెట్లు, విశాలమైన రోడ్లు పరిశుభ్రంగా ఉన్న పరిసరాలు చూసి ఇది మన దేశమేనా అన్న అనుమానం కలిగింది సుమీ. చల్లని గాలి మేను తాకింది, పరవశించే లోపు కార్యశాల స్థలం వచ్చేసింది. రిజిష్ట్రేషన్ లు పూర్తి చేసుకుని పని మొదలు పెట్టాము. కార్యశాల పనులు ఈ రోజుకి ముగిసాయి. సాయంత్రం వీలు చూసుకుని బృందావన్ గార్డెన్స్ చూడడానికి వెళ్తున్నాం అన్నారు మా నాయకుల వారు. అవునా వెళ్తున్నామా ? అనుకున్నాను నేను.

ఆయన అనుభవాన్ని, పరిచయాలను ఉపయోగించి వాహన సదుపాయం ఒకింత తక్కువ లో ఏర్పాటు చేశారు. అందరం ఆసక్తి చూపడం, భాగస్వాములు కావడం తో సాయంకాల సమయం లో బృందావన విహారానికి మా మైసూరు చైతన్య రథం బయలుదేరింది. మైసూరు నుండి 12 కిలోమీటర్ల ప్రయాణం, 20 నిమిషాలలో గమ్యం చేరుకున్నాము.

కావేరీ నదికి అడ్డంగా అంత ఎత్తున డ్యామ్ ఎలా కట్టారో, దాని పక్కనే ఇన్ని లక్షలమంది చూడడానికి వస్తున్న ఈ బృందావన్ గార్డెన్ ఎలా నిర్మించారో, వివిధ ఎత్తులలో అంచెలంచలుగా మొక్కలు ఎలా డిజైన్ చేశారో, వివిధ ఎత్తులలో ఫౌంటెన్ లు నాట్యమాడుతుంటే , ఆశ్చర్యం,అద్భుతం, సంభ్రమం , వంటి పదాల కంటే గొప్పగా వర్ణించడానికి పదాలు వెతుక్కునేంత అనుభూతి పొందాను. సాయంకాలం రంగురంగుల LED దీపాలు, జలపాతాల హోరు, సంగీతాల జోరు, వెరసి మ్యూజికల్ ఫౌంటేన్ షో ఓ మరపురాని అనుభూతిని, ఆశ్చర్యాన్ని ఇచ్చింది అంటే అతిశయోక్తి కాదు.

1927 లో నిర్మాణం ప్రారంభమై, 1932 కి పూర్తి చేసుకున్న కృష్ణ రాజా సాగర డ్యామ్ 1,20,000 ఎకరాలకు నీరు అందిస్తుంది. ప్రతి ఏటా సుమారు 2 మిలియన్ల మంది దీనిని సందర్శిస్తున్నారు. 1980-90 దశకాలలో బోలెడన్ని సినిమాల షూటింగ్ లు ఇక్కడ జరిగాయి . ఇన్ని విశేషాలు కలిగిన బృందావన్ గార్డెన్స్ యొక్క అందాలు మీరూ చూడాలంటే ఈ క్రింది వీడియో ను చూడండి.

1927 లో నిర్మాణం ప్రారంభమై, 1932 కి పూర్తి చేసుకున్న కృష్ణ రాజా సాగర డ్యామ్ 1,20,000 ఎకరాలకు నీరు అందిస్తుంది. ప్రతి ఏటా సుమారు 2 మిలియన్ల మంది దీనిని సందర్శిస్తున్నారు. 1980,90 దశకాలలో బోలెడన్ని సినిమాల షూటింగ్ లు ఇక్కడ జరిగాయి . ఇన్ని విశేషాలు కలిగిన బృందావన్ గార్డెన్స్ యొక్క అందాలు మీరూ చూడాలంటే ఈ క్రింది వీడియో ను చూడండి.

ఇంకా మైసూరు లో నేను చూసిన అన్ని ప్రదేశాల గురించి సవివరంగా మీకు త్వరలో వివరించబోతున్నాను. ఈ రోజుల్లో కూడా ఇంత ఓపికగా ఈ ఆర్టికిల్ పూర్తిగా చదివిన మీకందరికీ వందనాలు..

7 thoughts on “మైసూరు ముచ్చట్లు- 1

  1. RAJANI MANCHENA

    Marvellous…… excellent……. totally no words to say Praveen Sir. I have seen your excitement & awesome experience about Mysore trip in every letter of your words.
    Be Happy Always 🙂

    Reply

Leave a Reply

Your email address will not be published.