ఆలెక్సా రెండు నెయ్యి దోశలు ప్రింట్ చేయి

మీరు చదివింది కరెక్టే . దోశల ప్రింటర్ వచ్చేసింది. చపాతీలు తయారు చేసే యంత్రం ఎక్కువ వంటగదులలోకి దూరక ముందే మరో విచిత్ర యంత్రం తయారు అయింది.

ఉరుకుల పరుగుల జీవితం లో చపాతీలు దోశలు తయారు చేయాలంటే ఎంత సమయం, ఎంత ఓపిక ఉండాలో చేసే వారికే తెలుస్తుంది.అలాంటి వారి సమయాన్ని శ్రమ ను ఆదా చేసేందుకు వచ్చేసింది. దోశ లు ప్రింట్ చేసే యంత్రం..

Evo chef వారు తయారు చేసిన ఈ యంత్రం స్మార్ట్ గా పనిచేస్తుందట. రోస్ట్ గా కావాలన్నా లేదా మెత్తగా ఉండాలన్నా, నెయ్యి దోశలైనా, లేక వెన్న దోశలైనా ఇంకా రాగి దోశ లాంటివి కూడా తయారు చేస్తుందట.. పిండిని ప్రింటర్ లో ఇంకు పోసినట్టు పొయ్యడమే అఆ తర్వాత స్విచ్ ఆన్ చేసి ఎంత రోస్ట్ కావాలి ఎన్ని కాపీలు , కాదు కాదు ఎన్ని దోశలు కావాలంటే అన్ని ప్రింట్ చేసి పెడుతుంది. మీరు పెనం ముందు గంటలు గంటలు నిలుచోవల్సిన పని అసలు లేదు.

నువ్వే కావాలి సినిమా లో కోవై సరళ

“చిన్ని చిన్ని ఆశ కాలుతోంది దోశ

చిన్ని చిన్ని ఆశ కాలుతోంది దోశ

పిండి నే తీసి , పెనముపై పోసి ,

అట్లకాడ తోసి తిరగేసి తీసి ..”

అని పాడుకుంటూ దోశలు వేసేది.. ఇక ఆ పాట “పిండినే తీసి ,, మిషన్ లో పోసీ అని పాడుకోవాలి కాబోలు..

నమ్మబుద్ది కావట్లేదు కదూ.. నాకూ అలానే అనిపించింది.. ఇటీవల వీళ్ళు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో చూసే వరకూ నాకూ నమ్మ బుద్ది కాలేదు.. చూశాక నిజమే సుమీ అనిపిస్తుంది. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి..

https://bit.ly/3ALTIgc

అతివల కష్టాన్ని, సమయాన్ని కాస్త ఆదా చేసేందుకు మనిషి సృష్టించిన మరో అద్భుత యంత్రం ఇది. అన్నట్టు దీని ధర మాత్రం ఇంకా చెప్పలేదండీ.. నంబర్ ఇచ్చినట్లు ఉన్నారు.. కనుక్కోండి.. ఓటి తెచ్చేసుకోండి అలా పడి ఉంటది..

ఆహా ఏమి రుచి అనరా మైమరచి.. యంత్రపు దోశలలో రుచిఎలాగుండునో ..

ఎవరైనా తెప్పించుకుంటే నాకూ ఓ రెండు దోశలెయ్యండి వచ్చేస్తా తినడానికి..

ఇట్లు..

మీ

పోతురాజు..

Leave a Reply

Your email address will not be published.